అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి

  • ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్ కు బాహుబలి యానిమేషన్ చిత్రం ఎంపిక
  • 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ప్రదర్శించనున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'
  • ఇది భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమన్న దర్శకధీరుడు
యానిమేషన్‌కు ఎలాంటి హద్దులు ఉండవని తాను ఎప్పుడూ నమ్ముతానని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్‌కు ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేషన్ చిత్రం ఎంపికవడం భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న యానిమేషన్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'. ఈ చిత్రం 'అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026'కు ఎంపికైంది. యానిమేషన్ రంగంలో ఆస్కార్‌గా భావించే ఈ వేడుకలో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో దీన్ని ప్రదర్శించనున్నారు. భారతీయ మెయిన్‌స్ట్రీమ్ సినిమాకు చెందిన యానిమేషన్ ప్రాజెక్ట్ ఈ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.

రాజమౌళి తన ట్వీట్‌లో ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు ఇషాన్ శుక్లాతో పాటు మొత్తం బృందాన్ని అభినందించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యానిమేషన్ వేదికపై తమ విజన్‌ను ప్రదర్శించేందుకు టీమ్ మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు.

'బాహుబలి: ది ఎటర్నల్ వార్'లో మహిష్మతి సామ్రాజ్యం, అమరేంద్ర బాహుబలి, భల్లాలదేవుడి కథలను యానిమేషన్ రూపంలో మరింత అద్భుతంగా చూపించనున్నారు. ఈ ఎంపిక భారత యానిమేషన్ రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, ప్రపంచ యానిమేషన్ పటంలో భారతీయ కథలకు ఇది ప్రత్యేక స్థానం కల్పిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Rajamouli
Baahubali The Eternal War
Annecy Film Festival
Indian animation
animation film
Shobu Yarlagadda
Ishan Shukla
animation industry
Mahishmati Empire
Amarendra Baahubali

More Telugu News